ఆందోళన వద్దు.. నిద్రే ముద్దు

SMTV Desk 2018-05-05 13:13:36  health tips, depression, sleeping tips, hyderabad

హైదరాబాద్, మే 4 : ఉరుకుల పరుగుల జీవితం.. సంపాదించాలన్న ఆలోచనల సాగరంలో ప్రస్తుత సమాజం సాగిపోతుంది. దీంతో పని ఒత్తిడి వలన వచ్చే ఆందోళనను కుదురుగా ఉండనీయదు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే గనక ఇంకా కుంగిపోవడం ఖాయం కాబట్టి.. ఎలా బయటపడాలనేది ఆలోచించాలి. దానికీ కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. >> కనీసం పదిహేను నుంచి ఇరవైసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. దీనివల్ల మనసే కాదు.. శరీరానికీ విశ్రాంతి అందుతుంది. ఆందోళనా కొంతవరకూ తగ్గుతుంది. >> మీరు బాగా ఆనందంగా ఉన్న సందర్భాలనూ, సానుకూలంగా స్పందించిన పరిస్థితులూ వూహించుకోండి. దాంతో మీ ఆలోచనా ధోరణిలో కొంత మార్పు కనిపిస్తుంది. కుదిరితే స్నేహతులతో కాసేపు గడిపి చూడండి. >> కనీసం అరగంట నుంచి గంట వరకూ.. నిద్రపోయేలా చూసుకోండి. ఫలితంగా ఆందోళన తగ్గి.. తరవాత ఉత్సాహంగా మారగలుగుతారు. >> కొన్నిసార్లు అనవసరంగా వూహించుకోవడం వల్ల కూడా ఆందోళన పెరిగిపోతుంది. మీరలా వూహించుకునేవారయితే.. ఆ ఆలోచనలకు చుక్కపెట్టి.. ఏదయినా పనిలో పడండి. వీలైనంత ఎక్కువసేపు పనిచేసేలా చూసుకోండి. >> సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కూడా కంగారుగా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. మీ పరిస్థితి కూడా అదే అయితే.. మర్నాడు చేయాల్సిన పనుల్ని ముందే రాసుకుని పెట్టుకోండి. ముఖ్యమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వండి.