ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం: కేంద్ర వాదనను తోసిపుచ్చిన సుప్రీం

SMTV Desk 2018-05-03 18:32:02  sc st act, supreme court, delhi, sc,st act

న్యూఢిల్లీ, మే 3 : ఎస్‌సీ, ఎస్‌టీ చట్టంపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల హక్కుల పరిరక్షణకు నూరు శాతం కట్టుబడి ఉన్నామని కోర్టు కేంద్రానికి తెలిపింది. దళితులపై వేధింపులకు పాల్పడే దోషులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టంపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరైనవి కావని, వాటిపై స్టే విధించాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. తమ రివ్యూ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదలాయించాలని కేంద్రం కోర్టును కోరింది. అయితే ఈ అంశంపై తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం కింద బాధితులు ఫిర్యాదు చేయగానే తక్షణ అరెస్టులను నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు,పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన బాట చేపట్టాయి. భారత్‌ బంద్‌ను నిర్వహించి నిరసన వ్యక్తం చేశాయి.