ప్రజల సమస్యల్లోంచి పుట్టిన పోలీస్.. "చిట్టి"

SMTV Desk 2017-07-06 18:48:06  robot, in, police,

గచ్చిబౌలి, జూలై 06 : ఇంజినీరింగ్‌ చేసిన నలుగురు విద్యార్ధులు కలిసి అంకుర సంస్థను ఆరంభించారు. ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల సమస్యలను సులభంగా పరిష్కరించడానికి రోబోటిక్స్ ను ఉపయోగించడం. పోలీసు విధులను నిర్వర్తించే విధంగా రోబోకి ఆకారాన్ని కల్పించారు. ఈ సంవత్సరం డిసెంబరు 31న జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ఈ రోబోని విధుల్లో నియమించాలన్న లక్ష్యాన్ని చేపట్టారు. గచ్చిబౌలిలోని టీహబ్‌లో ‘హెచ్‌బోట్స్‌ రోబొబిక్స్‌’ అంకుర సంస్థ ఉన్నది. గోకరాజు రంగరాజు కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన కిషన్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన హర్ష, అభిషేక్‌, కంప్యూటర్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చేసిన అవినాష్‌లు కలిసి దీన్ని తయారుచేశారు. కిషన్‌ రోబోటిక్స్‌కు సంబంధించి మద్రాస్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, వీఐటీలో వీరు శిక్షణ పొందారు. వివిధ నగరాలలో, గ్రామాలలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను గుర్తించారు. వీటి పరిష్కారానికై గచ్చిబౌలిలో మేకర్స్‌ లీవే పేరిట రోబో తయారీ ప్రయోగశాలను ప్రారంభించారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా ఇలాంటివి 40 ప్రారంభించాలన్న లక్ష్యంతో ముందుకుసాగారు. రోబో ప్రొటోటైప్‌ పనులను పూర్తిచేసి, సెప్టెంబర్‌ నాటికి సిద్ధం చేయనున్నారు. రెండు నెలలపాటు అది పనిచేసే విధానాన్ని పరిశీలిస్తామన్నారు. అందుకు తగిన మార్పులు చేసి డిసెంబరు 31న విధుల్లో ఉంచుతామని ఇందుకు 3లక్షల వరకు ఖర్చవుతుందని కిషన్ తెలిపారు. రోబో సీసీ కెమెరా సదరు ప్రాంతంలోని చిత్రాలను, వీడియోలను ఎప్పటికిప్పుడు కంట్రోల్‌రూమ్‌కు తెలియజేస్తుంది, బాంబులను పసిగడుతుంది. ఏదైనా వాహనాన్ని ఎక్కువసేపు నిలిపినా, వస్తువులు పడి ఉన్నా వెంటనే సమాచారమిస్తుంది. ఇది సౌరశక్తితో పనిచేస్తుందని తెలిపారు. ఇటీవల జరిగిన సింగపూర్‌లోని అంతర్జాతీయ రోబోటిక్స్‌ సదస్సుకు కిషన్‌ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌కు అవసరమైన పోలీసు రోబోను తయారుచేశారు. ఆ స్ఫూర్తితో కిషన్‌ ఇలాంటి రోబోలను తయారుచేద్దామని స్నేహితులతో కలిసి తన ఆలోచనను పంచుకున్నారు. దానికి సంబంధించిన డిజైన్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌ బుధవారం ఆవిష్కరించారు.