మోదీ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ప్రకాష్ రాజ్..

SMTV Desk 2018-05-03 11:42:26  prakash raj fires on modi, actor prakash raj, karnataka elections, prime minister

సింధనూరు, మే 3: బహు భాషా సినీ నటుడు, సాహితీవేత్త ప్రకాష్‌రాజ్ ప్రధాని మోదీపై మాటలతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సింధనూరులో దళిత, ప్రగతిపర సంఘాలు ‘ప్రజాస్వామ్య రక్షణ కోసం’ పేరిట బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగైదు సభల్లో మోదీ మాట్లాడిన కన్నడ ప్రసంగాన్ని అనుకరించి చూపించారు. ఏమిటండీ ఈ భాష కాయగూరలు అమ్మినట్లు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."ప్రధాని మోదీజీ ..! 2019 తర్వాత దేశంలో మీకు అంతగా పనేం ఉండదు. కర్ణాటక వచ్చేస్తే మా వాళ్లు కూర్చోబెట్టి కన్నడ భాష నేర్పిస్తారు. ఏమిటండీ.. ఎన్నికల ప్రచార సభల్లో మీ కన్నడ ప్రసంగం..!" అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగంతో పోటీ పడుతున్న మోదీని ప్రకాష్‌ తీవ్రంగా విమర్శించారు. "రాహుల్‌ వయసెంత..మీ వయసెంత మోదీజీ.. సిగ్గుగా లేదా" అని అన్నారు. "ఈ నెల 15న కర్ణాటక ఎన్నికల ఫలితాలే చెబుతాయి. ఇక్కడ మీ ప్రతాపం ఎంతుందో? ఇక్కడి నుంచే భాజపా పతనం ఆరంభమవుతుంది" అని జోస్యం చెప్పారు.