ఆ అర్హత నాకు లేదు : ఎన్టీఆర్

SMTV Desk 2018-05-02 11:17:23  mahanati, mahanati audio launch, keerhi suresh, naga ashwin director.

హైదరాబాద్, మే 2 : సావిత్రి జీవిత కథని "మహానటి" పేరుతో తెరకెక్కిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించారు. సమ౦త, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, శాలినీ పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మిక్కీ జె.మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను విడుదల చేశారు. తోలి సీడీని ఎన్టీఆర్‌ ఆవిష్కరించగా.. సావిత్రి కుమారుడు సతీష్‌, కుమార్తె విజయ చాముండేశ్వరి అందుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ... "సావిత్రి గొప్పతనం గురించి మాట్లాడే అర్హత ఎన్ని జన్మలెత్తినా రాదు. నిజంగా సావిత్రి నా వద్దకు వచ్చి తాత(ఎన్టీఆర్) వేషం వేయమన్నారు. ఆయన వేషం వేసే అర్హత నాకు లేదు. ఆయన పాత్ర పోషించడం ఈ జన్మలో జరగని పని. ఆ పాత్ర పోషించే దమ్ము నాకు లేదు" అన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. "ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి ఈ మూడు పేర్లూ తెలుగు చలన చిత్ర చరిత్రలో మిగిలిపోతాయి. నా ఎనిమిది నెలల వయసులో నన్ను ఎత్తుకుని చిత్రసీమకు పరిచయం చేశారు సావిత్రి. బయోపిక్‌ తీయాలి అంటే అర్హత ఉండాలి. తెలుగులో తీసిన తొలి బయోపిక్‌ ఒక స్త్రీ కథ కావడం గర్వంగా ఉంది. ఇంత మంచి చిత్రంలో నేను లేనన్న బాధ ఉంది. అయితే చైతూ, సమంతలు భాగస్వాములు కావడం సంతోషంగా అనిపించింది" అన్నారు. దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ.. "జెమిని గణేశన్‌, సావిత్రి గార్లకు వీరాభిమానిని. వాళ్ల కథల్ని తెరపై తీసుకురావడం, అందులో నేను నటించడం ఆనందంగా ఉంది. నాగికి ఇది రెండో సినిమా అంటే నమ్మబుద్ధి కాలేదు. ఈ సినిమాతో చాలామంది స్నేహితులు దొరికారు" అన్నారు. కీర్తి సురేష్‌ మాట్లాడుతూ.. "నాగి, స్వప్న నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ పాత్ర నేను చేయలేనని చెప్పేశా. కానీ నాగి నాలో నమ్మకాన్ని కలిగించారు. ఆయన్ని చాలా సందేహాలు అడిగేదాన్ని. కొన్నింటికి విజయ చాముండేశ్వరిగారి సలహాలు తీసుకున్నా. ఈ చిత్రంలో నేను కథానాయికని కావొచ్చు. కానీ ఈ కథని నడిపే స్టార్‌ మాత్రం సమంతనే" అన్నారు. సమంత మాట్లాడుతూ.. "ఇలాంటి ఓ గొప్ప చిత్రంలో నాకూ అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది. ఇందులో నేను నాయికని కాదు. కానీ ఓ సన్నివేశం కోసం ఒప్పుకోవాలనిపించింది. ఆ సన్నివేశం కోసమే నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నా. ఆ సీన్‌లో గ్లిజరిన్‌ వాడకుండానే కన్నీళ్లొచ్చాయి" అన్నారు.