పశువధ నిషేధంపై భగ్గుమన్న కేరళ

SMTV Desk 2017-05-29 13:50:24  kerala,cm pinrai vijayn,animals,animal prohibition

తిరువనంతపురం, మే 29 : పశువధ నిషేధంపై కేరళ భగ్గుమన్నది. వధశాలలకు పశువుల విక్రయాన్ని నిషేధిస్తూ కేంద్రం తెచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆందోళన మిన్నంటింది. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు బీఫ్‌ఫెస్ట్‌లతో ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. మరోవైపు ప్రజల ఆహారపుటలవాట్లను కేంద్రం మార్చలేదన్న ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమ రాష్ట్రంలో కేంద్రం నిర్ణయం చెల్లదన్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా అమలు చేయాలని చూస్తున్నది.. ఇది లౌకిక, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.. మేము గొడ్డు మాంసం తినడం ద్వారా కేంద్రానికి, ప్రధాని మోదీకి మా నిరసన తెలుపుతున్నాం అని డీవైఎఫ్‌ఐ జాతీయాధ్యక్షుడు మహ్మద్ రియాజ్ స్పష్టంచేశారు. కొల్లాం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం ఎదుట బీఫ్ వండి తిన్నారు. డీసీసీ అధ్యక్షుడు బిందుకృష్ణ మాట్లాడుతూ, బీఫ్ వంటకాన్ని ప్యాక్ చేసి ప్రధాని మోదీకి పంపామన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోని మాట్లాడుతూ కేంద్రం జీవోను చెత్తబుట్టలో పారేయాలన్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారాన్ని బ్లాక్‌ డేగా పాటిస్తామని ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల తెలిపారు. తమిళనాడులోనూ పలుచోట్ల నిరసనకారులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు.