ఎవరినో టార్గెట్ చేసి సినిమాలు తీయను : కొరటాల

SMTV Desk 2018-05-01 11:11:48  koratala shiva, thanks meeting, press meet, bharath ane nenu.

హైదరాబాద్, మే 1 : దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం భరత్ అనే నేను విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటించింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం విడుదలైన నాటి నుండి రికార్డుల పరంగా దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ కొరటాల విలేకరులతో మాట్లాడారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో.. " ఈ సినిమాకు అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు రావడంతో నా సినిమాల్లోనే ఇది మైలురాయిగా నిలిచింది. మంత్రి కేటీఆర్ నాకు ఫోన్ చేసి అభినందించడం, జయప్రకాశ్ నారాయణ సినిమా చూసి సినిమా చాల బాగుంది అనడం మరచిపోలేని అనుభూతి" అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. పొలిటికల్ నేపథ్యంలో సినిమా తీసి హిట్ కొట్టారు. ఒక్క కాంట్రవర్సీ లేకుండా.. ఇది మీకు ఎలా సాధ్యమైంది.? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. "నేను సినిమా తీసేటప్పుడు ఎవరిని బాధపెట్టకూడదనే ఉద్దేశంతో తీస్తా. ఎవరినో టార్గెట్ చేసి దాని ద్వారా హిట్ కొట్టాలనే ఛీప్ మెంటాలిటీ నాకు లేదు. ఒకవేళ అలా చేయవలసి వస్తే సినిమాలు తీయను. ఎవరినీ నొప్పించకుండా, ఒక చిన్న ఆలోచన కలిగించేలా సినిమా తీస్తే చాలు అనుకుంటాను. అందుకే "భరత్ అనే నేను" సినిమా అందర్నీ మోటివేట్ చేసేలా తీశాను.." అని సమాధానమిచ్చారు.