ట్విటర్‌ లో వ్యక్తిగత డేటా తస్కరణ..!

SMTV Desk 2018-04-30 14:07:39  twitter data leaked, social media twitter, face book, cambridge analytics

కాలిఫోర్నియా, ఏప్రిల్ 30 : ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల వాడకం పెరిగిపోయింది. అందులో ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విటర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇటీవల ఫేస్‌బుక్‌ లో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవ్వడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఇప్పుడు తాజాగా ట్విటర్‌ యూజర్ల డేటా కూడా దుర్వినియోగమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఖాతాదారుల అనుమతి లేకుండా వారి పబ్లిక్‌ డేటాను ట్విటర్‌ అమ్మేసినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను తస్కరించిన కేంబ్రిడ్జ్‌ అనలిటికాకే ట్విటర్‌ యూజర్ల సమాచారం కూడా చిక్కినట్లు సమాచారం. అంతేగాక ఫేస్‌బుక్‌ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన అలెగ్జాండర్‌ కోగన్‌కే ట్విటర్ ఈ డేటాను విక్రయించినట్లు బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో పేర్కొంది. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీకి చెందిన అలెగ్జాండర్‌ కోగన్‌.. ‘పర్సనాలిటీ క్విజ్‌’ యాప్‌ను తయారుచేశాడు. ఈ యాప్‌ను వాడాలంటే ఫేస్‌బుక్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి. అలా దాదాపు 8.7కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను కోగన్‌ సేకరించి కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు అందించాడు. కాగా.. కోగన్‌కు సొంతంగా గ్లోబల్‌ సైన్స్‌ రీసర్చ్‌(జీఎస్‌ఆర్‌) అనే కమర్షియల్‌ ఎంటర్‌ప్రైస్‌ ఉంది. ఈ సంస్థ ద్వారా ట్విటర్‌ నుంచి యూజర్ల డేటాను తీసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.