ధోని@150

SMTV Desk 2018-04-29 11:46:30  dhoni, csk captain, chennai super kings, ipl

పుణె, ఏప్రిల్ 29: రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌ లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సత్తా ఏ మాత్రం తగ్గలేదు. ఇంచు మించుగా సీనియర్ ఆటగాళ్లతో టోర్నీలో ఆదరగోడుతుంది. తాజాగా ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో చరిత్రలోనే సారథిగా 150మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. శనివారం రాత్రి ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన రికార్డును మహి ఖాతాలో వేసుకున్నాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంతో సీఎస్‌కే రెండేళ్లపాటు ఐపీఎల్‌కు దూరం కావాల్సి వచ్చింది. అప్పుడు ధోనీ రైజింగ్‌ పుణె సూపర్‌గైంట్‌కు ఆడాడు. 2016లో ఆ జట్టుకు సారథ్యం వహించినా, 2017లో ఆ జట్టు యాజమాన్యం ధోనీని తప్పించి స్టీవ్‌ స్మిత్‌కు పగ్గాలు అందించింది. ప్రస్తుతం ధోనీ సారథ్యంలో చెన్నై ఏడు మ్యాచ్‌లలో ఐదింట గెలవగా, రెండింట ఓడి పాయింట్ల పట్టికలో ప్రథమ కొనసాగుతోంది. ఈ సందర్భంగా శనివారం మ్యాచ్‌తో సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనీ విజయవంతంగా 150మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నట్లు.. ఆ జట్టు యాజమాన్యం ట్విటర్‌ ద్వారా తెలిపింది. ఐపీఎల్‌ కెప్టెన్ గా ఇప్పటివరకూ ఎవరూ ఇన్ని మ్యాచ్‌లకు సారథ్యం వహించలేదు. ఇక మహి నాయకత్వంలోనే సీఎస్‌కే రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలవగా, నాలుగు సార్లు రన్నరప్‌గా నిలిచింది.