నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరుస్తాం : కేటీఆర్

SMTV Desk 2018-04-28 17:10:49  madhapur, mindspace raheja, ghmc, ktr

హైదరాబాద్‌, ఏప్రిల్ 28 : మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ కూడలిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన అండర్ పాస్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరవాసులను ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ అన్నారు. రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మార్గం అందుబాటులోకి రావటంతో సైబర్ టవర్స్ నుంచి బయోడైవర్సిటీకి వెళ్లే వాహనదారులకు సులభంగా ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు రూ.23 వేల కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపట్టామని, వీటన్నంటినీ అనుకున్న లక్ష్యానికన్నా ముందుగానే నిర్మాణం పూర్తి చేసి ఒక్కోటిగా ప్రారంభిస్తామని కేటీఆర్‌ చెప్పారు. ఇందులో భాగంగా మే 1న ఎల్‌బీనగర్‌లోని చింతల్‌కుంట అండర్ పాస్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఇష్టారీతిన దారులు మూసివేయడం సరికాదని, హైదరాబాద్ ప్రజల హితం కోసం సామరస్యపూర్వకంగా ముందుకు సాగుదామని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.