కొల్లేరుకు తగ్గిన జలకళ ..

SMTV Desk 2018-04-27 11:21:55  kolleru lake, eluru kolleru lake, west godavari, andhrapradesh

ఏలూరు, ఏప్రిల్ 27 : మండుతున్న ఎండలకు ప్రజలు బయటకు అడుగు వేద్దామంటేనే భయపడిపోతున్నారు. సూర్యుడి భగభగ ధాటికి చెరువులు, నదులు, బావులు కూడా అడుగంటిపోతున్నాయి. తాజాగా ఆసియాఖండంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఏడాది పొడవునా జలకళ సంతరించుకుని పర్యాటక ప్రేమికులతో కళకళలాడే కొల్లేరుకు ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గటంతో పాటు కొల్లేరులోని జలాలను చేపల చెరువుల్లోకి నిబంధనలకు విరుద్ధంగా ఇంజిన్లతో తోడేయటంతో పాటు దిగువకు వెళ్లిపోతుండటంతో సరస్సు నేడు వెల వెలబోతోంది. గతంలో ఏడాది పొడవునా కొల్లేరులో నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం ఐదారు నెలల పాటు నిల్వ ఉండటం గగనమవుతోంది. కొల్లేరులో నీరు అడుగంటడంతో విదేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చే పక్షులు సైతం రాను రాను తగ్గిపోతున్నాయి. సహజసిద్ధంగా పెరిగే మత్స్యసంపద కనుమరుగవుతోంది. కొల్లేరులో పెరిగే పలు రకాల కలువలు, తామర పుష్పాలు కూడా కానరావటం లేదు. నోరులేని మూగజీవాలకు తాగునీరు కరవైపోతోంది. తాగునీటి కోసం కొల్లేరులోపలికి వెళ్లిన మూగజీవాలు తిరిగి రావటంలేదని ఆ ప్రాంతంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు పరిరక్షణతోనే ఆ ప్రాంత ప్రజల జీవనాధారం ఆధారపడి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సహజసిద్ధమైన కొల్లేరు సరస్సు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.