ప.గో. ను వణికిస్తున్న థిలాపియా లేక్‌ వైరస్..

SMTV Desk 2017-07-06 12:00:10  fish, bhimavaram, luthiya, lek, virus,

భీమవరం జూలై 6 : తాజాగా భారతదేశంలో థిలాపియా లేక్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) అధికారులు ప్రకటించారు. చేపల సాగు ఎక్కువగా ఉన్న దేశాలను ఈ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయిల్‌, కొలంబో వంటి దేశాల్లో సుమారు 80 శాతం వరకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధిలో కనిపించే లక్షణాలు: థిలాపియా చేపలపై పుండ్లు పుట్టి; పొలుసులు ఊడిపోతాయి, ఎర్రగా ఉండే చేప కళ్ళు తెల్లగా మారిపోతాయి. కదలికలు కూడా తగ్గిపోయి, మేత తినడం భారీగా తగ్గి, చేప చెరువు అడుగు భాగంలోకి చేరుతుంది. చేపలలో ఈ వ్యాధి లక్షణాలు కనుక ఉన్నట్లయితే వెంటనే స్థానికంగా ఉన్న తమ కార్యాలయాలకు తీసుకురావాలని ఎంపెడా ఏడీ డాక్టర్‌ పి.శ్రీనివాసులు సూచించారు. వాటిని పరీక్షల నిమిత్తం తమిళనాడులోని రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ ఆక్వా కల్చర్‌కు పంపిస్తామన్నారు. ఈ వైరస్ విషయంలో ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఈ థిలాపియా మూడు రకాలు, ఇందులో బ్లాక్ థిలాపియాకు పెద్దగా విలువ లేకపోవడంతో, అమెరికాకు చెందిన రెడ్ థిలాపియాను దిగుమతి చేసుకొని సాగు ప్రారంభించారు. కొంతకాలం కిందట ఫిలిఫైన్స్‌ నుంచి గ్రేథిలాపియా రకాన్ని దిగుమతి చేసుకుని వాటి పిల్లల్ని ఉత్పత్తి చేసే కేంద్రాన్ని (హేచరీ) కృష్ణా జిల్లా కంకిపాడులో ఏర్పాటు చేశారు. ఈ చేపలకు మంచి డిమాండ్ ఉండడంతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి పరిచే దిశగా ఎంపెడా కృషి చేస్తోందని అధికారులు వెల్లడించారు.