తిరుమలపై జీఎస్టీ తీపి కబురు!!!

SMTV Desk 2017-07-05 16:54:41  amaravathi, jst, laddu, minister yanamala, thirumala,

అమరావతి, జూలై 5 : లక్షల మంది భక్తులు తిరుమల శ్రీస్వామివారి దర్శనానికై వెళ్లి వస్తుంటారు. లడ్డూ ప్రసాదంపై ఇటీవల అమలులోకి వచ్చిన జీఎస్టీ ప్రభావం ఉండబోదని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. జీఎస్టీపై బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తిరుమల వెళ్లిన భక్తులు శ్రీవారి దర్శన అనంతరం లడ్డూ మహా ప్రసాదం కొనుగోలు చేస్తుంటారు. ఈ ప్రసాదానికి జీఎస్టీ ప్రభావం ఉండదు.అయితే రూ. 500పైన అద్దె ఉండే రూములకు జీఎస్టీ ప్రభావం ఉంటుందని యనమల చెప్పారు. దాదాపు దశాబ్దన్నర కాలం పాటు చర్చలు జరిగాకే జీఎస్టీ అమలులోకి వచ్చిందని ముందస్తు ప్రణాళిక లేకుండా జీఎస్టీ అమలు చేశారనే ప్రతిపక్షాల విమర్శలు సరికాదని యనమల చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా జీఎస్టీలో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ కౌన్సిల్లో చర్చించి మార్పులు చేసే అవకాశం ఉందని మంత్రి యనమల తెలిపారు. ఏక పన్ను విధానం ఉండడంతో పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రెవెన్యూ న్యూట్రాలిటి మెయిన్టెనెన్స్ చేయడానికే పెట్రోల్, డిజీల్, ఎక్సైజ్ వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదని ఈ సందర్భంగా యనమల తెలియజేశారు. పోలవరం నిర్మాణంపై పెరిగే జీఎస్టీ భారాన్ని కేంద్రమే భరిస్తుందని, రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ ప్రాజెక్టులపై పడే జీఎస్టీ భారాన్ని ఇంకా అంచనా వేయలేదని ఆర్థిక మంత్రి యనమల వెల్లడించారు. ఈ మేరకు శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులకు లడ్డూ మిరహా మిగితా వాటిపై జీఎస్టీ ప్రభావం ఉంటున్నట్లు తెలుస్తుంది.