అత్యాచారాలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

SMTV Desk 2018-04-22 17:46:22  Union minister Santosh Gangwar, Santosh Gangwar, controversy on rapes, POCSO act

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 : దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నా అత్యాచారాలు పై యావత్ భారతదేశ ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తూ శనివారం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అత్యాచారాలపై బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. దేశంలో అత్యాచారాలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) సంతోష్ గాంగ్వార్... కొన్నిసార్లు అలాంటి ఘటనలను నియంత్రించలేమని అన్నారు. శనివారం పోక్సో చట్టం ఆర్డినెన్సుకు కేబినెట్‌ ఆమోదించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అత్యాచార ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరం. ఒకవేళ అలాంటి జరిగితే కేంద్ర ప్రభుత్వం సత్వరమే స్పందిస్తోంది. భారత్‌ విశాల దేశం. కొన్నిసార్లు వాటిని నియంత్రించలేం’ అంటూ వివాదాస్పదంగా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి పదవిలో ఉండి అత్యాచారాలను నియంత్రించలేమని వ్యాఖ్యానించడం సరికాదని పలువురు అంటున్నారు.