జేడీ(ఎస్‌) బీజేపీతో దోస్తీ కడుతుందా..!

SMTV Desk 2018-04-22 12:53:24  karnataka elections, bjp-jds, congress, hd deve gowda

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: కర్ణాటక ఎన్నికల సమరం పై ఇప్పటికే ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహరచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ పీఠం అధిరోహించాలని భావిస్తుండగా.. బీజేపీ ప్రభుత్వం హస్తం పార్టీని గద్దేదించి కాషాయ జెండాను ఎగరేయాలని చూస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ స్థానాలు సంపాదించినప్పటికీ అధికారం చేపట్టడానికి అవసరమైన సంఖ్యాబలం రాదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారం చేపట్టకుండా చేయాలన్నదే తమ ధ్యేయమని, అందుకోసం ఎలాంటి రాజీకైనా సిద్ధపడతామని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. కాంగ్రెస్‌కు గతంలో మాదిరి 240 స్థానాల్లో 122 సీట్లు వచ్చే అవకాశాలు లేవని, ఆ పార్టీకి 100-110 సీట్లు వస్తాయని, బీజేపీ 70-80 సీట్లు సాధిస్తుందని ఆయన అంచనా వేశారు. జేడీఎస్‌ 40-50 సీట్లతో కింగ్‌మేకర్‌ పాత్ర పోషిస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే జేడీఎస్‌ అధ్యక్షుడు దేవెగౌడ వద్దకు తమ దూతల్ని పంపినట్లు సమాచారం. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు దేవెగౌడ కుమారుడు కుమారస్వామికి సీఎం పదవి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ దూతలు దేవెగౌడకు చెప్పినట్లు తెలుస్తోంది.