ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదం..

SMTV Desk 2018-04-22 12:30:13   Child Rape Punishable by Death, ordinance, ramnath kovindh signs, new delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 : దేశంలో నానాటికి పెరిగిపోతున్న మహిళాల అత్యాచారాలపై కేంద్రప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొనేదిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తూ శనివారం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈమేరకు ఈ ఆర్డినెన్సుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం సంతకం చేశారు. దీని ప్రకారం పన్నెండేళ్లలోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష పడనుంది. కథువా, ఉన్నావ్‌, సూరత్‌లో మైనర్లపై జరిగిన అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నవిషయం తెలిసిందే. ఆర్డినెన్సులో అంశాలు.. *మహిళలపై జరిగే అత్యాచారాలకు ఇప్పటి వరకూ ఉన్న ఏడేళ్ల శిక్షను పదేళ్లకు పెంచారు. నేర తీవ్రతను బట్టి ఇది జీవితఖైదుగా మారవచ్చు. *16ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి ప్రస్తుతం ఉన్న 10సంవత్సరాల జైలు శిక్షను 20ఏళ్లకు పెంచారు. *12ఏళ్లలోపు చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడే వారికి కనీస శిక్షగా జీవిత ఖైదు లేదా మరణశిక్షగానీ విధిస్తారు. దీనికి సంబంధించిన అప్పీళ్లపై ఆయా ఉన్నత న్యాయస్థానాలు ఆరు నెలల్లో వారి నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంటుంది. *16ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం, మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడిన వారికి ఎటువంటి ముందస్తు బెయిళ్లూ ఇవ్వకూడదు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు, బాధితుల తరఫు బంధువులకు కనీసం రెండు వారాల ముందస్తు నోటీసులు ఇవ్వాలి.