మొదటి స్థానం లో భారత్, వెనుకంజలో చైనా

SMTV Desk 2017-05-29 12:55:07  population,first in world,india,first place,

న్యూఢిల్లీ, మే 28 : జనాభా పెరుగుదలను అదుపు చేయటానికి చైనా 1979లో ఒకే బిడ్డ విధానాన్ని తీసుకువచ్చింది. దీనివల్ల కొంత మేలు, కొంత నష్టం జరిగాయి. జనాభాను తగ్గించటంతో పాటు మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, గృహవసతి, ఉపాధి కల్పన రంగాల్లో వేగవంతమైన ప్రగతి సాధించే అవకాశం కలిగింది. కానీ అదే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవటం ఇందులో ఒకటి. తత్ఫలితంగా ఆర్ధికాభివృద్ధిలో వెనుకబడిపోయే ఇబ్బంది ఏర్పడింది. 2050 నాటికి చైనా జనాభాలో నాలుగో వంతు మంది 65 ఏళ్లకు పైబడిన వృద్ధులే ఉంటారని అంచనా. దీంతో గత ఏడాది నుంచి ఒకే బిడ్డ విధానాన్ని చైనా ప్రభుత్వం సడలించింది. @2050 నాటికి అనూహ్య మార్పులు * ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 1950లో ప్రపంచ జనాభా 250 కోట్లు. * ప్రస్తుతం ఇది దాదాపు 750 కోట్లు * 2050 నాటికి జనాభా అంచనా- 970 కోట్లు (రాబోయే 33 ఏళ్లలో ప్రపంచ జనాభా మరో 200 కోట్లు పెరుగుతుంది!) * ఇప్పటిదాకా అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరుమోసిన చైనా అప్పటికి రెండో స్థానంలో ఉంటుంది. మొదటి స్థానంలో భారతదేశం ఉంటుంది. * జనాభా అత్యంత వేగంగా పెరుగుతున్న దేశం నైజీరియా. 1950లో 3.7 కోట్లు ఉన్న నైజీరియా జనాభా 2015 నాటికి 18.20 కోట్లకు చేరుకుంది. 2050 నాటికి భారత్‌, చైనా దేశాల తర్వాత నైజీరియా ఉంటుంది. * కాంగో జనాభా కూడా త్వరత్వరగా పెరుగుతోంది. 1950లో ఈ దేశం జనాభా 1.2 కోట్ల మందే. 2050 నాటికి 23 కోట్లు అవుతుందని అంచనా. * బ్రెజిల్‌ జనాభా వేగంగా తగ్గిపోతుంది. ఆ దేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతుంది. * 1950లో ఐరోపా దేశాలైన బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ జనాభా అధికం. కానీ ఇప్పుడు కాదు. జనాభా అధికంగా కల మొదటి పది దేశాల్లో వీటికి స్థానం లేదు. ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్న రష్యా 2040 నాటికే ఆ స్థానాన్ని కోల్పోతుంది. @2050 నాటికి భారత్‌ జనాభా 160 కోట్లు * అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం 2022 నుంచి 2025 మధ్యకాలంలో చైనా జనాభాను భారతదేశం అధిగమిస్తుంది. * భారత జనాభా 2050 నాటికి దాదాపు 160 కోట్లకు చేరుకొని అక్కడ స్థిరపడుతుంది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు జనాభా పెరుగుదల ఉండదు. * 2080 తర్వాత జనాభా తగ్గుదల మొదలవుతుంది. 2100 నాటికి 150 కోట్లకు దిగివచ్చే అవకాశం ఉంది. * భారత్‌లోని దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు ఇప్పటికే క్షీణించింది. ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, బీహార్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. * అధిక జనాభా వల్ల భారతదేశంలో విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాల కల్పన పెద్ద సవాలుగా మారుతుంది. మహిళలకు అధికంగా ఉద్యోగాలు కల్పించటంపై ప్రభుత్వం దృష్టిసారించాల్సి వస్తుంది.