కథువా దుర్ఘటనపై మనం సిగ్గుపడాలి : రాష్ట్రపతి

SMTV Desk 2018-04-18 15:06:01  kathua incident, president ramnath ramnath kovind, jammu kashmir, sri nagar

శ్రీనగర్, ఏప్రిల్ 18‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా ఘటన పై రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ స్పందించారు. జమ్మూ-కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం పట్ల అందరూ సిగ్గు పడాలని ఆయన అన్నారు. కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... "స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్ల తర్వాత కూడా చిన్నారులపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మన సమాజం ఎక్కడకి పోతుందో ఆలోచించుకోవాలి. స్త్రీలను, మహిళలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ముఖ్యంగా కథువాలో జరిగిన దుర్ఘటనపై భారతీయులందరూ సిగ్గు పడాలి. ఇకపై ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కడా జరక్కుండా చూసుకోవాలి. ఆడపిల్లలకు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛనిచ్చి, ఇప్పుడు వాళ్లపై పైశాచికం చూపడం అత్యంత దారుణమైన చర్య. దీనికి చరమగీతం పాడాలి" అని వ్యాఖ్యానించారు. జనవరి 10న కథువాకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని ఇంటి నుండి ఎత్తుకెళ్లిపోయారు. ఇది జరిగిన వారం తర్వాత రసానా గ్రామంలోని అడవుల్లో చిన్నారి శవమై కనిపించింది. దీనిపై చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు చిన్నారిపై అత్యాచారం చేసి చంపినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. చిన్నారికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.