మళ్లీ ఆ రోజులు గుర్తుకు తెచ్చారు : మమతా బెనర్జీ

SMTV Desk 2018-04-17 16:10:39  Mamata Banerjee, kolkata cm Mamata Banerjee, cash problems, kolkata

కోల్‌కతా, ఏప్రిల్ 17 : 2016 నవంబర్ 8 ఎప్పటికి మరిచిపోలేని రోజు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. ఇక అప్పటి నుండి సామాన్యులకు నగదు కష్టాలు మొదలయ్యాయి. అప్పుడప్పుడు పరిస్థితి సద్దుమణిగిన ఇప్పుడు మాత్రం కరెన్సీ కష్టాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి నెలకొన్నదా అని సందేహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఏటీఎంల్లో నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తిరిగి నోట్ల రద్దు కష్టాలను గుర్తుకుతెస్తోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. " పలు రాష్ట్రాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోవడం, పెద్ద నోట్లు అదృశ్యం కావడం చూస్తుంటే ఇవి నోట్ల రద్దు రోజులను తలపిస్తున్నట్టుగా ఉంది. దేశంలో ఏమైనా ఆర్థిక ఎమర్జెన్సీ విధించారా..?" అంటూ మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. ఏపీ, తెలంగాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా నగదు కొరత నెలకొంది. కాగా, నగదు కొరత తాత్కాలికమేనని రెండు మూడు రోజుల్లో పరిస్థితిని అధిగమిస్తామని, మార్కెట్‌లో తగినంతగా నగదు చెలామణిలో ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు.