థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యమయ్యే పనేనా..!

SMTV Desk 2018-04-17 15:10:23  kcr, third front, odisha cm Naveen Patnaik, hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 17 : ప్రస్తుతం భారతదేశంలో గుణాత్మకమైన మార్పు రావాలంటే ఫెడరల్ ఫ్రంట్ ఒక్కటే మార్గం అని ప్రగాఢంగా నమ్ముతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. ఈ విషయంపై చర్చించడానికి గతంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌లతో భేటీ అయిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాల గురించి చర్చించడానికి త్వరలో ఆయన ఒడిశాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో మే మొదటి వారంలో ఒడిశా సీఎం, బీజేడీ(బీజు జనతా దళ్) చీఫ్ నవీన్ పట్నాయక్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ విషయయంలో ఆసక్తిగా ఉన్న సినీనటుడు ప్రకాష్ రాజ్ తన వంతు సహకారాన్ని అందిస్తానని గతంలో అన్నారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి తనయుడు స్టాలిన్‌తో స్నేహపూర్వక సంబంధాలున్న ప్రకాష్ రాజ్, త్వరలో కరుణానిధితో భేటికి ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్న కేసిఆర్ ఆలోచనలు సఫలీకృతం అవుతాయా..? లేకుంటే మధ్యలోనే నీరుగారిపోతాయా అన్నది వేచి చూడాల్సిందే.