కనువిందు చేయనున్న కృత్రిమ జలపాతం - సింగపూర్‌ తరహాలో ఇంద్రకీలాద్రి

SMTV Desk 2017-05-29 12:46:40  indra kiladri,vijawada,water falls

ఇంద్రకీలాద్రి, మే 28: ఇంద్రకీలాద్రిపై కనువిందు చేసే కృత్రిమ జలపాతం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర రాజధాని నగరంలో కీలకమైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని రూ.125 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని దేవస్థానం మాస్టరు ప్లాను రూపొందించింది. అందులో భాగమైన కృత్రిమ జలపాతం ప్రతిపాదనకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించింది. తిరుపతిలో కపిలతీర్థం వద్దనున్న సహజ సిద్ధమైన జలపాతం వెంకన్న భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. విశాఖపట్నం సమీపంలోని అరకులో సైతం సహజమైన జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. దుర్గమ్మ చెంత కూడా జలపాతం ఏర్పాటు చేయాలనే అధికారుల ప్రతిపాదనలపై విమర్శలు కూడా వచ్చాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా జలపాతాల వల్ల వృథా ఖర్చు అన్న భావన భక్తుల్లో వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ పర్యాటకంలో భాగంగా ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు దుర్గగుడిని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇంద్రకీలాద్రి, పరిసరాల అభివృద్ధికి దేవస్థానం అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సహజ సిద్ధంగా.. సింగపూర్‌లోని జురంగ్‌ బర్డ్‌ పార్కులో 125 అడుగుల ఎత్తున కృత్రిమ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. ఇది విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అదే తరహాలో ఇంద్రకీలాద్రిపై కృత్రిమ జలపాతం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జలపాతం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాన్ని తొలుత ఎంపిక చేశారు. మల్లికార్జున మహామండపం ఎదురుగా ఉన్న యాగశాల స్థలంలో జలపాతానికి అవసరమైన నీటి తొట్టిని ఏర్పాటు చేస్తారు. మోటారు సహకారంతో నీటిని రెండు వందల అడుగుల ఎత్తుకు పంపింగ్‌ చేస్తారు. పైనుంచి పడిన నీటిని తిరిగి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారని దుర్గగుడి అధికారులు చెబుతున్నారు. నీరు ఎత్తు నుంచి పడటంతో పాటు జలపాతం చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసి సహజ సిద్ధమైన జలపాతం అనుభూతిని కలిగించేలా నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే సింగపూర్‌లో కృత్రిమ జలపాతం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీని కూడా సంప్రదించమని ఉన్నతాధికారులు దేవస్థానం అధికారులకు సూచించారు. ఐదు నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దుర్గగుడి ఈఈ భాస్కర్‌ నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా కృత్రిమ జలపాతం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో సహజ సిద్ధమైన జలపాతాలు ఉన్నాయి, కానీ కృత్రిమ జలపాతం ఇదే మొదటిది. టెండర్ల ప్రక్రియ ఈ నెల 29 నుండి ప్రారంభమవుతుంది. టెండర్ల దాఖలుకు ఆఖరు గడువు జూన్‌ 14. కృత్రిమ జలపాతం నిపుణుల కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాత ఏర్పాటు చేస్తారు. దాని నిర్వహణ బాధ్యతను కూడా నిర్ణీతకాలం సంబంధిత టెండరు దారుడే స్వీకరించే విధంగా నిబంధనలు విధిస్తున్నారు.