దోషులను వెంటనే శిక్షించాలి : రాహుల్‌ గాంధీ

SMTV Desk 2018-04-16 19:44:56  rahul gandhi, kathua incident, modi, congress

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: జమ్ముకశ్మీర్‌లోని కథువాలో 8ఏళ్ల చిన్నారిపై అతి దారుణంగా అత్యాచారం, హత్య ఘటనతో యావత్ భారతం చలించిపోయింది. కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి మండిపడ్డారు. చిన్నారులపై లైంగిక దాడులు సిగ్గుచేటని.. ఈ కేసుల్లో దోషులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. "2016లో దేశవ్యాప్తంగా బాలికలపై 19,675 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. ఇది చాలా సిగ్గుచేటు. మన పుత్రికలకు న్యాయం చేయాలని ప్రధాని మోదీ నిజంగా భావిస్తే ఈ కేసులపై విచారణ వేగవంతం చేయాలి. దోషులను వెంటనే శిక్షించాలి’ అని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. ఇంతకుముందు కూడా రాహుల్ గాంధీ ఇదే మాదిరి ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై ఈ విషయంపై ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ప్రధాని కూడా స్పందించారు. కథువా, ఉన్నావ్‌ ఘటనల్లో నిందితులెవరైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ అన్నారు. ‘మన పుత్రికలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు.