భారత్ లో బ్యాంకింగ్ సంక్షోభం..!

SMTV Desk 2018-04-16 19:05:18  Banking inclusion, ICICI Ceo chandakochar, Axis ceo shikha sharma

హైదరాబాద్, ఏప్రిల్ 16: ఇటీవల జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు..కుంభకోణాలు, నష్టాల్లో ప్రైవేటు బ్యాంక్ లు కొట్టుమిట్టడుతుండగా స్కాంలు, సుడిగుండాల్లో ప్రభుత్వ బ్యాంక్ లు ఇరుక్కుపోతున్నాయి. 9 వేల కోట్లతో విజయ్ మాల్య, 13,600 కోట్లతో నీరవ్ మోది వివిధ బ్యాంక్ ల నుండి అప్పులు తీసుకొని విదేశాలకు పారిపోయారు. బడాబాబులు వేల కోట్లు దోచేస్తుంటే ప్రభుత్వం వారు తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేయలేకపోయింది. సామాన్యులు ఒక్క ఇఎం ఐ కట్టకపోతే ముక్కుపిండి వసూలు చేసే బ్యాంక్ లు కోట్లలో రుణాలు ఎగ్గొట్టిన బడాబాబులపై చర్యలు తీసుకోకపోవడం దేశవ్యాప్తంగా విమర్శలకు తావిస్తుంది. కొన్ని కంపెనీలకు ఇష్టానుసారంగా రుణాలిచ్చిన యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖాశర్మ, ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ చందాకొచ్చర్ లపై వేటుపడనున్నట్లు తెలుస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ నుండి వీడియోకాన్ గ్రూప్ కు 3,250 కోట్లు చందాకొచ్చర్ ఇచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ దూత్ న్యూ పవర్ కంపెనీ అధినేత దీపక్ కొచ్చర్ కు 64 కోట్లు అప్పు ఇచ్చారు. ఈ విషయమై సీబీఐ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో కూరుకుపోవడానికి సిఈఓ శిఖాశర్మ ను బాధ్యురాలిగా చేస్తూ తప్పించే యత్నం లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిణామాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మూల కేంద్రమైన బ్యాంకింగ్ రంగం పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఇదిలా ఉండగా మోదీ నోట్ల రద్దు, ఎఫ్ఆర్డిఐ బిల్లుతో ఫ్రీజింగ్ చేస్తారనే భయంతో ఖాతాదారులు తమ సొమ్ముని ఎప్పటికప్పుడు బ్యాంకు ల నుండి డ్రా చేస్తున్నారు. దీంతో కొన్ని బ్యాంక్ ల్లో డబ్బు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో పలు బ్యాంకుల ఎటీఎంల్లో నగదు లేక ఖాతాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు, మూడు సంవత్సరాల్లో కొన్ని బ్యాంకులు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు. ఆర్బీఐ, ఆర్థికశాఖ, ప్రభుత్వం బ్యాంకింగ్ రంగం పై నిబంధనలను కఠినతరం చేసి, బ్యాంకు దొంగలు కాజేసిన సొమ్మును రికవరీ చేయకపోతే రాబోయే రోజుల్లో బ్యాంకుల్లో సంక్షోభం ఏర్పడే అవకాశముంది.