కామన్వెల్త్‌ గేమ్స్‌ : పీవీ సింధు Vs సైనా నెహ్వాల్‌..

SMTV Desk 2018-04-14 12:34:51  common wealth games-2018, p.v sindhu, saina nehwal, gold coast

గోల్డ్‌కోస్ట్‌, ఏప్రిల్ 14: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణీలు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు మధ్య ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. వీరిద్దరు మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఆదివారం బ్యాడ్మింటన్ అభిమానులకు రసవత్తరపోరు కన్నుల పండుగ చేయనుంది. సెమీస్‌లో సైనా స్కాట్లాండ్‌ క్రీడాకారిణిపై గెలిచి ఫైనల్‌కు రాగా, మరో సెమీస్‌లో ఒలిపింక్‌ పతక విజేత సింధు కెనడా క్రీడాకారిణిపై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల సెమీస్‌లో కిదాంబి శ్రీకాంత్‌ ఇంగ్లాండ్‌ క్రీడాకారుడిపై విజయం సాధించాడు. మరో పురుషుల సెమీస్‌లో హోరాహోరీగా జరిగిన పోరులో భారత్‌కు చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, చాంగ్‌ వీ లీ (మలేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఫైనల్లో శ్రీకాంత్‌ స్వర్ణం కోసం చాంగ్‌ వీలీతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన సాత్విక్‌ రంకిరెడ్డి-చిరాక్‌ శెట్టి జోడీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌లో పురుషుల డబుల్స్‌ జట్టు ఫైనల్స్‌ చేరడం ఇదే మొదటి సారి కావడం విశేషం.