రాజకీయాలకు నో చెప్పిన మాజీ క్రికెటర్లు

SMTV Desk 2018-04-13 18:34:38  rahul dravid, anil kumble, karnataka elections, bjp

బెంగుళూరు, ఏప్రిల్ 13 : కర్ణాటకలో వచ్చే నెల జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాలను ముమ్మరం చేశాయి. 224 స్థానాలకు గానూ జరిగే ఈ మహాసమరం కోసం ఈ రెండు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నాయి. మిషన్‌–150 లక్ష్యాన్ని చేరుకునే దిశలో కార్యకలాపాలను రూపొందించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారులకు గాలం వేసింది. క్రికెట్‌ ఆటగాళ్లు రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లేలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కుంబ్లే వన్యప్రాణుల మండలి ఉపాద్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ద్రావిడ్ ఎన్నికల రాయబారిగా వ్యవహరిస్తున్నారు. యువ ఓటర్లను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లను పార్టీలోకి చేర్చుకోవాలని ఆలోచన చేసింది. దీంతో ఈ ఇద్దరి క్రికెట్‌ ఆటగాళ్లతో పార్టీకి చెందిన ప్రముఖ నేత పలుమార్లు చర్చించారు. అయితే రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లేలు తాము రాజకీయాలకు దూరంగా ఉండాలని ఖరాఖండిగా చెప్పడంతో బీజేపీ ప్రయత్నాలు విఫలమయ్యాయి.