గేల్‌ బరిలోకి వస్తాడా..!

SMTV Desk 2018-04-13 12:47:02  chris gayle, kings x1 punjab, rcb, ipl

బెంగళూరు, ఏప్రిల్ 13 : ఐపీఎల్ మ్యాచ్ అంటేనే .. అదో రకమైన మజా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు అభిమానులను ఎంతోగానో అలరించాయి. కానీ ఎక్కడో వెస్ట్ండీస్ మెరుపు వీరుడు క్రిస్ గేల్‌ విధ్వంసం చూడలేదనే నిరాశ. ఈ రోజు బెంగుళూరు జట్టు తమ సొంత గడ్డపై కింగ్స్ X1 పంజాబ్‌తో తలపడనుంది. మొదట మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు సునీల్‌ నరైన్‌ మెరుపు ఇన్నింగ్స్‌, నితీష్‌ రాణా అల్‌రౌండ్‌ ప్రదర్శనతో కోహ్లీ సేన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం బెంగుళూరు దృష్టి తమ మాజీ ఆటగాడైన‌ క్రిస్‌ గేల్‌పై ఉంది. పంజాబ్‌ తొలి మ్యాచ్‌లో గేల్‌ ఆడలేదు. ఈరోజు జరిగే రెండో మ్యాచ్‌లో కూడా గేల్‌ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. "శుక్రవారం జరిగే మ్యాచ్‌లో మేం గేల్‌తో ఆడతామని ఊహించడం లేదు. ఏ జట్టుకైనా గేల్‌ గురించి ఎక్కువ తెలుసంటే.. అది ఆర్‌సీబీనే. కొనాళ్లపాటు అతను బెంగళూరుకు ఆడాడు. అతని సామర్థ్యం గురించి మాకు బాగా తెలుసు, అలాగే ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు. గేల్‌ గురించి మేం ఏ మాత్రం భయపడటం లేదు. కేఎల్‌ రాహుల్ కూడా మొదటి మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌ని కనబరిచాడు. ఇక్కడి పరిస్థితులు అతనికి బాగా తెలుసు" అని బెంగుళూరు కోచ్‌ డేనియల్ వెటోరీ వెల్లడించారు. గేల్‌ 2011 నుంచి ఏడు సీజన్లలో బెంగళూరు తరఫున ఆడాడు. అయితే పదకొండో సీజన్‌లో గేల్‌ను ఆర్‌సీబీ వదులుకోవడంతో అతన్ని చివరికి పంజాబ్‌ రూ 2.కోట్లకు దక్కించుకుంది. మరి ఈ స్టార్ ఆటగాడిని పంజాబ్ ఈ మ్యాచ్ లోనైనా బరిలోకి దింపుతుందేమో చూడాలి.