ఆ తీర్పు వల్ల దేశానికి చాలా నష్టం : కేంద్ర ప్రభుత్వం

SMTV Desk 2018-04-13 11:55:13  sc,st act, supreme court, new delhi, central govt

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 : భారత రాజ్యాంగంలో ముఖ్యమైన ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ నిర్ణయం వలన ప్రజల ఆగ్రహానికి, అశాంతికి కారణమై దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ తీర్పు చట్టాన్ని బలహీనపరిచేలా ఉందని వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తక్షణం అరెస్టులు చేయకుండా మార్చి 20వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగాయి. దీంతో ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషనదాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు మద్దతుగా గురువారం కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక నివేదిక సమర్పించింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు తీవ్ర గందరగోళానికి దారి తీసిందని, సమీక్ష ద్వారా, ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవటం ద్వారా ఈ అంశాన్ని చక్కదిద్దవచ్చని తెలిపింది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక విభాగాల మధ్య అధికారాల విభజన భారత రాజ్యాంగంలో ప్రాథమిక భాగమనీ, చట్టాలు చేయగలిగే ఎలాంటి అవకాశమూ కోర్టులకు లేదని కేంద్రం స్పష్టం చేసింది.