రసవత్తర పోరులో రైజర్స్ దే పైచేయి..

SMTV Desk 2018-04-13 11:05:37  sun risers hyderabad, ipl, mumbai indians, uppal

హైదరాబాద్, ఏప్రిల్ 13 : సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ మరో సారి సత్తా చాటింది. నిన్న ముంబై ఇండియన్స్ జట్టుతో ఉప్పల్ వేదికగా జరిగిన రసవత్తర పోరులో ఒక వికెట్ తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఆఖరి వరకు ఎంతో టెన్షన్ తో సాగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టునే అదృష్టం వరించింది. ఈ మ్యాచ్ ఫలితంతో ఆడిన రెండు మ్యాచ్ లలో ముంబై ఓటమి చవిచూడగా, సన్ రైజర్స్ జట్టు తను ఎదుర్కొన్న రెండు మ్యాచ్ ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. తొలుత టాస్ నెగ్గిన సన్ రైజర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు బ్యాటింగ్ ఆది నుండి తడబాటుకు లోనయ్యైంది. సారథి రోహిత్ శర్మ (11) విఫలం కాగా, లూయిస్‌ (29), పొలార్డ్‌ (28), సూర్యకుమార్‌ (28) రాణించడంతో ముంబై నిర్ణీత 20ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సన్ రైజర్స్ జట్టులో సందీప్, కౌల్, స్టాన్‌లేక్‌ తలా 2 వికెట్లు పడగొట్టగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్ర మే ఇచ్చి ఒక వికెట్‌ తీయడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదన కు దిగిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు శిఖర్ ధావన్ (45), సాహా(22) మంచి ఆరంభాన్నిచ్చారు. తర్వాత ముంబయి బౌలర్లు మార్కండే (4/23), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (3/24), బుమ్రా (2/32) మ్యాచ్ ను రసవత్తరంగా మార్చేశారు. కానీ చివరిలో దీపక్ హుడా (32 నాటౌట్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.