జియో నుండి మరో సంచలనం నిర్ణయం..!

SMTV Desk 2018-04-12 19:14:01  reliance jio, mukesh ambani, new progarrame launch, new delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 : రిలయన్స్ జియో.. సంచలనాలకు మారుపేరుగా మారి టెలికాం సంస్థలకు తమ ఆఫర్లతో చెమటలు పట్టిస్తుంది. జియో దెబ్బకు మిగతా కంపెనీలు వినయోగాదారులను ఎలా కాపాడుకోవాలో తెలియక అయోమయానికి లోనవుతున్నాయి. తాజాగా జియో..ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి తెరతీయబోతోందని తెలుస్తోంది. తన ఆర్పూ(యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌)ను పెంచుకోవడం కోసం సిమ్‌ కార్డుతో ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీనిపై ఇప్పటికే అమెరికా చిప్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌తో ముఖేష్‌ అంబానీకి చెందిన ఈ కంపెనీ చర్చలు కూడా జరిపిందని తెలిసింది. బిల్ట్‌-ఇన్‌ సెల్యులార్‌ కనెక్షన్స్‌తో విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడిచే ల్యాప్‌టాప్‌లను ఇది మార్కెట్‌లోకి ప్రవేశపెడుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి. క్వాల్‌కామ్‌ ఇప్పటికే 4జీ ఫీచర్‌ ఫోన్‌ కోసం జియోతో కలిసి పనిచేస్తోంది. "జియోతో మేము మాట్లాడాం. డేటా, కంటెంట్‌తో కూడిన ఒక డివైజ్‌ను వారు తేవాలనుకుంటున్నారు" అని క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మిగ్యుల్ న్యున్స్ తెలిపారు. ఈ చీప్‌మేకర్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) బ్రాండ్‌ స్మార్ట్రాన్‌తో కూడా పనిచేస్తోంది. సెల్యులార్‌ కనెక్టివిటీతో స్నాప్‌డ్రాగన్‌ 835 అందించే ల్యాప్‌టాప్‌లను ఇది ప్రవేశపెట్టబోతోంది. ఈ చర్చలను స్మార్ట్రాన్‌ కూడా ధృవీకరించింది. గ్లోబల్‌గా హెచ్‌పీ, ఆసుస్‌, లెనోవో వంటి కంపెనీలతో కూడా క్వాల్‌కామ్‌ పనిచేస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి రిలయన్స్‌ జియో నిరాకరించింది.