క్షమించండి.. చెన్నై సూపర్ కింగ్స్

SMTV Desk 2018-04-12 18:46:27  Chennai Super Kings (CSK) , Shoes hurled in cheapak, ipl, kolkatha knight riders

చెన్నై, ఏప్రిల్ 12 : కావేరి యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలనీ తమిళనాడు రాష్ట్రంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. దీంతో అక్కడ జరగాల్సిన మ్యాచ్ లను బీసీసీఐ పుణే కు తరలించిన విషయం తెలిసిందే. అంతకుముందు మంగళవారం సొంతగడ్డపై కోల్‌కతాతో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఆందోళనకారులు మైదానంలోకి బూట్లు విసిరారు. కోల్‌కతా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో డుప్లెసిస్‌, రవీంద్ర జడేజా మైదానంలో పడిన బూట్లను బయటకు విసిరేశారు. తర్వాత ఈ సంఘటనకు పాల్పడిన ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు బూట్లు విసిరిన దానికి చింతిస్తూ చెన్నై అభిమానులు తమ ఆటగాళ్లను ట్విటర్‌ ద్వారా క్షమాపణలు కోరుతున్నారు. ‘మీరంటే మాకు ఎప్పటికీ గౌరవమే. స్టేడియంలో జరిగిన ఘటనకు చాలా బాధపడుతున్నాం. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాం’ అంటూ ట్వీట్‌ చేస్తున్నారు. అయితే ఈ విషయం పై స్పందించిన జడేజా.. "సీఎస్‌కే అభిమానులంటే మాకు ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. అది ఎప్పటికీ కొనసాగుతుంది" అని ట్విటర్‌ ద్వారా తెలిపాడు.