చరిత్ర లిఖించిన కిదాంబి శ్రీకాంత్‌..

SMTV Desk 2018-04-12 16:07:17  KIDAMBI SRIKANTH, BWF RANKINGS, P.V.SINDHU, PRAKASH PADUKONE

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 : తెలుగుతేజం, బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ చరిత్ర లిఖించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ( బీడబ్ల్యూఎఫ్) ఈ వారం విడుదల చేసే ర్యాకింగ్స్ లో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రీకాంత్‌ రికార్డు సృష్టించాడు. గాయం వలన గత ఏడాది అక్టోబరులో శ్రీకాంత్‌ నంబర్‌వన్‌ ర్యాంకును చేరుకోలేకపోయాడు. సోమవారం కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలో మలేషియాను 3-1తేడాతో భారత బ్యాడ్మింటన్‌ జట్టు చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు సార్లు ఒలింపిక్‌ రజత పతక విజేత లీ చాంగ్‌ వీకి షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్‌ ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కంప్యూటరైజ్డ్‌ ర్యాంకింగ్‌ పద్ధతి లేనప్పుడు 1980లో ప్రకాశ్‌ పదుకొణె నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ ఆ ఘనతను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది.