సీఎస్‌కే మ్యాచ్‌లు పుణెకు తరలింపు

SMTV Desk 2018-04-12 13:32:47  chennai super kings, cauvery issue, ipl, pune stadium

చెన్నై, ఏప్రిల్ 12 : ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో సొంతగడ్డపై జరిగే మిగతా ఆరు మ్యాచ్ లు చూసే అదృష్టం తమిళ తంబిలు కోల్పోయారు. గత కొద్దిరోజులుగా కావేరీ జల వివాదానికి సంబంధించి తమిళనాడు రాష్ట్రం అట్టాడుకిపోతుంది. ఈ నిరసన సెగ ఇప్పుడు ఐపీఎల్‌ను కూడా వదలలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో చెన్నైలో జరగాల్సిన మిగతా ఆరు మ్యాచ్‌లను పుణెకు తరలించాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రత్యామ్నాయంగా పుణె, విశాఖపట్నంలతో పాటు త్రివేండ్రం, రాజ్‌కోట్‌ నగరాల్ని కూడా పరిశీలించినప్పటికీ.. పుణె వైపే బోర్డు మొగ్గు చూపింది. "ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని చెన్నై పోలీసులు చెప్పారు. మ్యాచ్‌లను పుణెలో నిర్వహించడానికి సీఎస్‌కే నుంచి ఎలాంటి అడ్డు చెప్పలేదు. వేరే నగరాల నుంచి నేరుగా విశాఖపట్నానికి వెళ్లే విమానాలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రయాణ సౌలభ్యం పుణెకే బాగా ఉంది. అందుకే అక్కడికే మ్యాచ్‌లను తరలించాలని నిర్ణయించాం" అని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు.