"గరుడ వేగ" చిత్ర ప్రదర్శన ఆపండి..

SMTV Desk 2018-04-12 12:48:15  dont screen garudavega movie, civil cort verdict,

హైదరాబాద్, ఏప్రిల్ 12 : ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్‌ హీరోగా నిర్మితమైన చిత్రం "గరుడ వేగ" చిత్రానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రదర్శనలు ఉండరాదని సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని హైదరాబాద్‌ ఉప్పరపల్లిలోని అటమిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సిటీ సివిల్‌ కోర్టు.. తమ వాదనలు వినిపిస్తూ మొత్తం సినిమా యురేనియం కార్పొరేషన్‌లో జరిగిన స్కాం గురించి ఉందన్నారు. యురేనియం స్కాంలో ఎమ్మెల్యే, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించారని.. ఎన్‌ఐఏ అసిస్టెంట్‌ కమిషనర్‌గా హీరో స్కాంను బట్టబయలు చేస్తున్నట్లు చూపారన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. పిటిషనర్‌ వాదనలతో జడ్జి ఏకీభవిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు టీవీల్లోగానీ, యూట్యూబ్, ఇతరత్రా ఏరకంగానూ ఈ చిత్ర ప్రదర్శన ఉండరాదని, ప్రెస్‌మీట్‌లు నిర్వహించరాదంటూ నిర్మాతలు, దర్శకుడితోపాటు యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. అనంతరం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.