కామన్వెల్త్‌ గేమ్స్ : భారత్ ఖాతాలో మరో స్వర్ణం

SMTV Desk 2018-04-11 13:44:20  common wealth games-2018, Shreyasi Singh, gold coast, women, varsha varman

గోల్డ్‌కోస్ట్, ఏప్రిల్ 11‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్ షూటర్లు ఆదరగోడుతున్నారు. మహిళల షూటింగ్‌ డబుల్‌ ట్రాప్‌లో భారత్‌కు చెందిన శ్రేయసి సింగ్‌ అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం సాధించింది. క్రీడల ప్రారంభంలో భారత వెయిట్‌ లిఫ్టర్లు మనకు పతకాలు అందిస్తే ఆ తర్వాత ఆ షూటర్లు అదే హవాను కొనసాగిస్తున్నారు. మరో భారత క్రీడాకారిణి వర్ష వర్మన్‌ ఒక్క పాయింట్‌ తేడాతో నాలుగో స్థానంలో నిలిచి రజతం దక్కించుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది ఈ సందర్భంగా శ్రేయాసి మాట్లాడుతూ..‘బంగారు పతకం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. గత కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం దక్కింది. అప్పుడు స్వర్ణం రానందుకు చాలా ఆందోళన చెందాను. తదుపరి కామన్వెల్త్‌లో ఎలాగైన స్వర్ణం సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నా. చాలా కష్టపడ్డా’ అని వెల్లడించింది. 2014లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో శ్రేయసి రజతాన్ని తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు పురుషుల డబుల్‌ ట్రాప్‌లో భారత్‌కు చెందిన షూటర్‌ అంకుర్‌ మిట్టల్‌కు కాంస్యం దక్కింది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 24 పతకాలతో మూడోస్థానంలో కొనసాగుతోంది.