ఆ రాష్ట్రాల వాదన సరికాదు : అరుణ్ జైట్లీ

SMTV Desk 2018-04-11 13:29:03  arun jaitley, 15 thfinancial commission, southern states, new delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 :15వ ఆర్దికసంఘం నియమాలు వలన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయా రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు కేంద్రప్రభుత్వ విధానంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో పథకాలు ద్వారా అభివృద్ధి చెందుతూ దేశానికి పన్నురూపంలో అధిక రాబడి ఇస్తుంటే వాటిని ఉత్తరాది రాష్ట్రాలుకు పంచడం ఎంతవరకు సమంజసమని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన కేంద్రమంతి అరుణ్ జైట్లీ వారి వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ ఆయన ఫేస్‌బుక్‌లో వ్యాసం రాశారు. 15 వ ఆర్ధికసంఘం ఇచ్చిన నిబంధనలపై దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని జైట్లీ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ అనవసర వివాదం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయా వాదనల్లో ఎలాంటి నిజం లేదని జైట్లీ స్పష్టం చేశారు. అధిక జనాభా కలిగిన రాష్ట్రాలు, పేద రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వచ్చేలా నిబంధనలు రూపొందించినట్లు వివరించారు. పన్నుల ఆదాయం పంపానికి 1971 జనాభా లెక్కలకు బదులుగా 2011 లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవడాన్ని జైట్లీ సమర్ధించుకున్నారు. 14వ ఆర్థిక సంఘం 2011 లెక్కల్ని పరిగణనలోకి తీసుకుని పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచిందని గుర్తు చేశారు. పన్నుల ఆదాయం పంపిణీకి 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవడం పట్ల మంగళవారం తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పన్నుల ఆదాయం పంపిణీకి 1971 జనాభా లెక్కల్నే ప్రాతిపదికగా తీసుకోవాలని సదస్సు తీర్మానించింది.