బిల్లింగ్స్.. బ్యాంగ్.. బ్యాంగ్..

SMTV Desk 2018-04-11 10:54:38  chennai super kings, sam billings, ipl, kolkatha knight riders

చెన్నై, ఏప్రిల్ 11 : చెన్నైలోని చెపాక్ స్టేడియం సిక్స్ ల మోతతో దద్దరిల్లింది. రెండేళ్ల నిషేధం తర్వాత వచ్చిన తమలో సత్తా తగ్గలేదని చెన్నై జట్టు మరో సారి రుజువు చేసింది. ఆరంభ మ్యాచ్ లో ముంబైని ఓడించిన సీఎస్ కే జట్టు, నిన్న చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. సొంతగడ్డపై శామ్‌ బిల్లింగ్స్‌ (56 23 బంతుల్లో 2×4, 5×6) మెరుపులతో అసాధ్యంలా కనిపించిన గెలుపును చెన్నై తమ వశం చేసుకొంది. అంతకుముందు కోల్‌కతా ఆండ్రి రసెల్‌ (88; 36 బంతుల్లో 1×4, 11×6) సునామీ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 6 వికెట్లకు 202 పరుగులభారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ నెగ్గిన ధోని ప్రత్యర్ధిని బ్యాటింగ్ కు ఆహ్వనించాడు. ఓపెనర్ గా వచ్చిన మెరుపు వీరుడు నరైన్ (12) ను రెండో ఓవర్లో హర్భజన్‌ పెవిలియన్ కు పంపాడు. తర్వాత లిన్‌ (22), నితీశ్‌ రాణా (16), ఉతప్ప (29) కొన్ని షాట్లు ఆడి వెనుదిరిగారు. తర్వాత ఆసలు మ్యాచ్ మజా మొదలైంది. క్రీజులోకి వచ్చిన్ రస్సెల్ ..తొలి 11 బంతుల్లో 10 పరుగులే చేసిన తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా అతను కొట్టిన 11 సిక్స్ లలో 6 సిక్స్ లు బ్రావో బౌలింగ్ లో బాదినవే. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టు ఆరంభం అదిరిపోయింది. వాట్సన్ (42)‌, రాయుడు (39) వీళ్లిద్దరూ మొదటి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటంతో చెన్నై స్కోరు ఉరకలు పెట్టింది. వీరు ఔటైన అనంతరం స్కోర్ వేగం మందగించింది. క్రీజులోకి వచ్చిన రైనా (14), ధోని (25) విఫలమయ్యారు. దీంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. అయితే బిల్లింగ్స్ కుదురుగా ఆడుతూ చక్కటి షాట్లతో విజయం వైపుగా నడిపించాడు. 9 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు పెవిలియన్ బాట పట్టాడు. సమీకరణం 6 బంతుల్లో 17 పరుగులుగా ఉండగా చివరి ఓవర్‌ వేసిన వినయ్‌ కుమార్‌ లయ తప్పాడు. ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన జడేజా చెన్నై కు విజయాన్ని అందించాడు.