కేసీఆర్ అమిత్ షాతో సరితూగలేరు

SMTV Desk 2017-05-29 12:03:43  laxman,bjp president laxman fire on cm kcr

హైదరాబాద్, మే 28 : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కేసిఆర్ ఏమాత్రం సరితూగలేరని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ వెల్లడించారు. అమిత్ షాను విమర్శించే స్థాయి ఆయనకు ఎంతమాత్రం లేదని ప్రకటించారు. తెలంగాణ ప్రయోజనాల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుండి వస్తున్న నిధులను టిఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్ళించి తమ పబ్బం గడుపుకునేందుకు జనాన్ని మాయ చేస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. తనకు తాను తానీషాలా వ్యవహరిస్తున్న కేసీఆర్, భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండుటెండలో ప్రజలను కలిసేందుకు అమిత్ షా వెళితే, కేసిఆర్ మాత్రం ప్రగతి భవన్ లో ఏసి వేసుకోని కూర్చున్నారని చెప్పారు. ఎక్కడో వండిన భోజనాన్ని సహపంక్తి భోజనంగా అమిత్ షా తిన్నారనడం బాధాకరమని, దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నాటకాలు ఆడింది ఎవరో, ప్రజలకు స్పష్టంగా తెలుసునని అయన వెల్లడించారు.