తొలి సమరంకు రె"ఢీ"..

SMTV Desk 2018-04-09 11:44:09  ipl, sun risers hyderbad, rajastan royals, ball tampering

హైదరాబాద్, ఏప్రిల్ 9 : బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా జట్టుకు ఎంత నష్టం చేసిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు దీని ప్రభావం మాత్రం ఐపీఎల్ లోని రెండు జట్లపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథి వార్నర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ దూరం కావడం ఆ జట్లకు కోలుకోలేనిదెబ్బ. ఇప్పుడు ఈ రెండు జట్లు ఐపీఎల్ లో తొలి సమరంకు సిద్ధమవుతున్నాయి. సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌తో రాజస్థాన్‌ ఢీకొట్టనుంది. సన్ రైజర్స్ జట్టులో వార్నర్ పాత్ర మరువలేనిది. కెప్టెన్ గా జట్టును విజయపథంలో నడిపించిన ఘనత ఈ ఆసీస్ ఆటగాడి సొంతం. ఇప్పుడు వార్నర్ గైర్హాజరీతో ఎస్ఆర్ హెచ్ సారథ్య భాద్యతలను విలియమ్సన్‌ చూసుకోనున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ గా తన అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొంది. మరోవైపు శిఖర్ ధావన్ కూడా అత్యంత కీలకమైన ఆటగాడు. వార్నర్ తర్వాత జట్టు బ్యాటింగ్‌లో క్రియాశీల పాత్ర అతనిదే. ఇక బౌలింగ్ విభాగం సన్ రైజర్స్ ప్రధాన బలం. గత రెండు సీజన్‌లలో అత్యధిక వికెట్లతో నీలి రంగు క్యాప్‌ను అందుకున్న భువనేశ్వర్‌ జట్టుకు ముఖ్య ఆయుధం. భువితో పాటు లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌, పేసర్లు బాసిల్‌ థంపి, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌శర్మలతో బౌలింగ్‌ విభాగం చాలా బలంగా ఉంది. ఇక అల్ రౌండర్ పరంగా షకిబ్ అల్ హసన్, బ్రాత్‌వైట్‌ రాణిస్తే రైజర్స్ కు తిరుగులేదు. రాజస్తాన్ జట్టులో స్మిత్ తప్పుకోవడంతో నాయకత్వ పగ్గాలు రహనే కు అప్పగించారు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ రాజస్థాన్‌ జట్టులో స్టార్‌ ఆటగాడు. ఐతే వివాదాలతో జట్టుకు దూరమై ఇటీవలే పునరాగమనం చేసిన స్టోక్స్‌ ఏమేరకు రాణిస్తాడన్నది చూడాలి. ఇక రూ.11.5 కోట్లతో దక్కించుకున్న పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ తన ధరకు న్యాయం చేయగలడా అన్నది చూడాలి..! నాయకులూ మారిన ఈ నావలు ఎటువంటి ప్రదర్శన చేస్తాయి..! బాల్ టాంపరింగ్ వివాదం ఈ జట్లపై ఏ మేర ప్రభావం చూపిస్తుందో..! బలహీనతలను దాటుకొని ఏ జట్టు బోణీ కొడుతుందో చూడాలి..!