కోన వెంకట్ ట్వీట్ కు నెటిజన్ల చురకలు..

SMTV Desk 2018-04-06 18:02:39  director kona venkat, kona venkat tweet, salman khan,

ముంబై, ఏప్రిల్ 6 : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు 1998లో కృష్ణ జింకలను చంపిన కేసులో జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. సల్మాన్ కు శిక్ష పడటంపై బాలీవుడ్ నటులు ఇప్పటికే తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ కు శిక్ష పడటంపై టాలీవుడ్ మాటల రచయిత కోన వెంకట్ స్పందించారు. "ఐ సపోర్ట్ సల్మాన్" అనే హ్యాష్ టాగ్ తో.. "సల్మాన్ కేసులో కోర్టు తీర్పు విని ఆశ్చర్యపోయా. దోషిగా తేలినంత మాత్రాన వ్యక్తిత్వంపై చర్చ జరపాల్సిన అవసరం లేదు. పర్యావరణ సమతుల్యతను కాపాడే నిమిత్తం జంతువుల వేటను చాలా దేశాల్లో ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. ముందు మనుషులను కాపాడాలి" అంటూ అభిప్రాయపడ్డారు. దీనికి నెటిజన్లు తమదైన శైలిలో కోన వెంకట్ కు చురకలు అంటించారు. "నిజమైన మనుషులు తమ సరదా కోసం జంతువులను వేటాడరు" అని, "మీలాంటి సెలెబ్రిటీల కోసం చట్టాలు నిబంధనలు మార్చుకోవాలా! మా భారతదేశంలో ఇలాంటివి అనుమతించరు సార్. కావాలంటే వేరే దేశాలకు మీరు వెళ్లి వేటాడుకోండి" అంటూ విరుచుకుపడ్డారు.