విమాన ప్రయాణికులకు తీపి కబురు

SMTV Desk 2018-04-06 15:20:54  Airlines, passangers, special package

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: విమాన ప్రయాణీకులకు తీపి కబురు. ఇకపై విమానాల్లో లగేజీ పోయినా, విమానాలు ఆలస్యం అయినా లేదా రద్దయినా విమానయాన సంస్థలు సదరు ప్రయాణికులకు భారీ పరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు టికెట్‌ రద్దు చేసుకునే ఛార్జీలు కూడా తగ్గించి ప్రయాణికులకు విమానయాన శాఖ ఊరట కల్గించనుంది. విమానాలు ఆలస్యమైన లేదా రద్దయిన సమయంలో ప్రయాణికులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని విమానయాన శాఖ ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశీయ విమానాల్లో లగేజీ పోయినా లేదా దెబ్బతిన్నా గరిష్ఠంగా రూ. 20వేల వరకు చెల్లిస్తున్నారు. అంతర్జాతీయ విమానాల్లో అయితే రూ. లక్ష వరకు పరిహారం కింద ఇస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో పోయిన లగేజీకి కేజీకి రూ. 3000 వరకు చెల్లించేలానిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అంతేగాక.. ప్రస్తుతం కొన్ని నిర్దేశిత కారణాల వల్ల విమానాలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులకు చెల్లించే మొత్తాన్ని కూడా పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది.