సంచలనాల సిరీస్.. సఫారీల వశం

SMTV Desk 2018-04-04 16:00:26  southafrica vs australia, south africa, test series, johansburg

జోహాన్స్ బర్గ్, ఏప్రిల్ 4 ‌: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను దక్షిణాఫ్రికా జట్టు సొంతం చేసుకుంది. ఎన్నో వివాదాలు, సంచలనాలకు కేంద్రబిందువైన ఈ సిరీస్ ను సఫారీ జట్టు 3-1తో కైవసం చేసుకుంది. ఎన్నో కొత్త రికార్డులు, చెత్త రికార్డులును మూటకట్టుకున్న ఈ టోర్నీని ఆసీస్ తో పాటు యావత్ ప్రపంచం మర్చిపోలేదు. బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఈ సిరీస్‌ వార్తల్లో నిలిచింది. సిరీస్ లో చివరి మ్యాచ్ ను ప్రోటీస్ జట్టు 492 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 1934 అనంతరం టెస్టుల్లో ఏ జట్టుకైనా ఇదే భారీ గెలుపు. మంగళవారం చివరిరోజు ఓవర్‌నైట్‌స్కోరు 88/3తో రెండోఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ 119 పరుగులకే కుప్పకూలింది. బర్న్స్‌ (42) ఒక్కడే రాణించాడు. ఈ మ్యాచ్‌తో మోర్నె మోర్కెల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. స్కోర్ వివరాలు : దక్షిణాఫ్రికా : తొలి ఇన్నింగ్స్ 488- ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 344 /6 డిక్లేర్డ్ ఆస్ట్రేలియా : తొలి ఇన్నింగ్స్ 221 - ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 119- ఆలౌట్ * 1970లో అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయం సాధించడం ఇదే తొలిసారి. * ప్రొటీస్‌ బౌలర్‌ ఫిలాండర్‌ ఆస్ట్రేలియాపై ఒక ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులిచ్చి ఆరుకు పైగా వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. * ఈ సిరీస్‌లో మిచెల్‌ మార్ష్‌ వికెట్ తీయడంతో ఫిలాండర్‌ రెండు వందల వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన ఏడో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. * సఫారీ జట్టు ఓపెనర్‌ మర్‌క్రామ్‌ పది టెస్టుల్లోనే వెయ్యి పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో సౌతాఫ్రికా జట్టు మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ 12 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. * ఆతిథ్య ఆటగాళ్లు అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేయగా ఆసీస్‌ మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించగా, ఆసీస్‌ తరుపున ఒక్క ఆటగాడు కూడా శతకం మార్క్ ను చేరుకోలేకపోయారు.