భారత్ బంద్‌ హింసాత్మకం..నలుగురి మృతి

SMTV Desk 2018-04-02 17:57:50  Bharath bandh, turn voilent, in madhya pradesh

భోపాల్, ఏప్రిల్ 2‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం తీవ్రంగా పడింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో బంద్‌ హింసాత్మకంగా మారి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, భింద్‌, మోరెనా, సాగర్‌, బాలాఘట్‌, సత్నా జిల్లాల్లో నిరసనలు హింసాత్మక ఘటనల వైపు దారి తీశాయి. ఆందోళనాకారులను నిలువరించడానికి పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గ్వాలియర్‌, మోరెనా, భింద్‌ సహా పలుచోట్ల ఇంటర్నెట్‌ సేవలు నిలిపేశారు. భింద్‌ జిల్లాలో పోలీసుల కాల్పుల్లో మహావీర్‌ సింగ్‌ అనే వ్యక్తి మృత్యువాతపడ్డారు. గ్వాలియర్‌లో ఇద్దరు మరణించారు. మోరెనా పట్టణంలో విద్యార్థి నేత రాహుల్‌ పతాక్‌ కాల్పుల్లో చనిపోయారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. పరిస్థితులను చక్కబెట్టేందుకు ఆర్మీని రంగంలోకి దించారు. గుజరాత్‌, రాజస్థాన్‌లలోనూ పెద్ద ఎత్తున ఆందోళనల జరిగాయి. రాజస్థాన్‌లో పలుచోట్ల కర్ఫ్యూ విధించారు. ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో బస్సులు, వాహనాలను తగులబెట్టారు. పంజాబ్‌లో, బిహార్‌లో రైళ్లను నిలిపేశారు. జాతీయ రహదారులు దిగ్బంధించారు. భారత్‌ బంద్‌ నేపథ్యంలో దాదాపు వంద రైళ్లు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దళిత వర్గాల ఆందోళనల కారణంగా ఢిల్లీ లో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కన్నౌట్‌ ప్రాంతంలో నిరసనకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. .