భారత్‌కు చేరిన 38 మృతదేహాలు

SMTV Desk 2018-04-02 17:06:47   Minister VK Singh Brought Back 38 Indians Mortal Remains Back Home

అమృత్‌సర్, ఏప్రిల్ 2‌: బతుకుదెరువు కోసం ఇరాక్‌ వెళ్లి, అంతర్యుద్ధం సమయంలో ఐసిస్‌ చేతిలో కిరాతకంగా హతమైన 38 మంది భారతీయు మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకున్నాయి. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఆర్మీ విమానంలో బాగ్ధాద్‌ నుంచి అమృత్‌సర్‌(పంజాబ్‌)కు తరలించారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ సూచనమేరకు సహాయ మంత్రి వీకే సింగ్‌ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకుగానూ సింగ్‌ ఆదివారం ఆర్మీకి చెందిన విమానంలో బాగ్ధాద్‌కు బయలుదేరారు. ఇరాక్‌లో చనిపోయిన 39 మందిలో ఒక మృతదేహానికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సిన ఉండగా, మిగిలిన 38 మంది మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. వీరిలో అత్యధికులు పంజాబీలే కావడం గమనార్హం. సోమవారం తీసుకొచ్చిన 38 మృతదేహాల్లో 27 దేహాలను పంజాబ్‌లోనే దించేశారు. అక్కడి నుంచి ఆయా మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. మిగిలిన మృతదేహాలను పట్నాకు తరలించారు. బాగ్ధాద్‌లోని భారత రాయయార కార్యాలయం మృతదేహాల తరలింపులో కీలక పాత్ర పోషించింది.