ఆ మధురమైన జ్ఞాపకంకు ఏడేళ్లు..

SMTV Desk 2018-04-02 13:43:15  mahendra singh dhoni, icc world cup 2011, world cup champions 2011, mumbai

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎప్పుడో 1983 లో కపిల్‌దేవ్‌ నేతృత్వంలో భారత్ ప్రపంచకప్‌ సాధించింది.. తర్వాత గంగూలీ సారథ్యంలో టీమిండియా క్రికెట్ జట్టు మరోసారి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా చేతిలో పరాభవం తప్పలేదు. అప్పటి నుండి ప్రపంచకప్‌ అందుకోవడం మనకు అందని ద్రాక్ష గా మిగిలిపోయింది. అయితే తర్వాత ధోని నాయకత్వంలో ఎలాగైనా కప్ దక్కించుకోవాలన్న కసితో బరిలోకి దిగిన టీమిండియా ఆ కలను సాకారం చేసుకొంది. దీంతో భారత్‌ 28ఏళ్ల నాటి కలకు తెరపడినట్లైంది. ఈ మధురమైన క్షణాలకు నేటికి ఏడేళ్లు. ముఖ్యంగా ఫైనల్ చివరిలో ధోనీ కొట్టిన సిక్స్ ను భారతీయ అభిమాని ఎప్పటికి మరిచిపోలేడు. 2011లో ఏప్రిల్ 2 ముంబయిలోని వాంఖడే మైదానంలో ఫైనల్‌ ఫ్రారంభమైంది. టాస్‌ గెలిచిన ప్రత్యర్ధి శ్రీలంక జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 274 పరుగులు చేసింది. 275 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ధోనీ సేన స్కోరు ఒక్క పరుగు వద్దే డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ (18) కూడా పెవిలియన్ కు చేరాడు. అంతే ఒక్క సారి మైదానంలో నిశబ్ద వాతావరణం నెలకొంది. అప్పుడే కోహ్లీతో కలిసి గౌతమ్‌ గంభీర్‌ భారత ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీలుచిక్కినప్పుడల్లా ఈ ఇద్దరూ బౌండరీలు బాదుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కోహ్లీ ఔటవ్వగానే ధోనీ మైదానంలోకి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గంభీర్‌తో జత కలిసిన ధోనీ దూకుడు ఆడడం ఆరంభించాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ తర్వాత గంభీర్(97) ఔటైనా మహేంద్రుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో మైదానంలోకి వచ్చిన యువరాజ్ తన బ్యాట్‌తో మెరిపించాడు. దీంతో టీమిండియా విజయానికి చేరువైంది. స్టేడియంలో అభిమానుల కేరింతలు, సందడి మధ్య 49వ ఓవర్‌ ప్రారంభమైంది. తొలి బంతిని ఎదుర్కొన్న యువీ ఒక పరుగు తీసి ధోనీకి స్ట్రైకింగ్‌ ఇచ్చాడు. రెండో బంతిని తనదైన శైలిలో సిక్స్‌గా మలిచిన ధోనీ భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.