అటు సింహాలు.. ఇటు ప్రసవం...

SMTV Desk 2017-07-01 14:56:33  The woman is childbirth, Gir Forest, 108 staff,Ambulance,Jaffarabad Hospital, Amreli district of Gujarat, Manguban is a pregnant woman named Macwana

అహ్మదాబాద్, జూలై 1 : ఎక్కడైనా సరే ఓ మహిళ ప్రసవం జరగాలంటే ఇంట్లోనో.. ఆస్పత్రిలోనో ..జరుగుతుందన్న విషయం తెలిసిందే. కానీ ఏకంగా 12 సింహాల మధ్య ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. విడ్డూరంగా ఉంది కదూ... అవును ఇది నిజమే.. అది కూడా అర్ధరాత్రి 2.30 గంటలకు గిర్ ఫారెస్ట్‌లో సింహాల మధ్య మహిళ ప్రసవించటం అంటే సాహాసాలతో కూడిన పనే మరి. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. అమ్రేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో మంగుబెన్ మక్వానా అనే గర్భిణికి పురిటి నొప్పులు మొదలు కావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఆ రాత్రి గ్రామానికి చేరుకున్నారు. ఆ గర్భిణిని జఫరాబాద్ ఆస్పత్రికి తరలించేందుకు గిర్ ఫారెస్ట్ మీదుగా అంబులెన్స్ బయల్దేరింది. ఫారెస్ట్‌లోకి అంబులెన్స్ వెళ్లగానే ఎదురుగా 10 నుంచి 12 సింహాలు వచ్చాయి. దీంతో అంబులెన్స్‌ను 108 సిబ్బంది నిలిపివేశారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 2.30 గంటలు. అంబులెన్స్‌ను చుట్టుముట్టిన సింహాలు గర్జీస్తుండడంతో వాహనం ముందుకు కదల్లేని పరిస్థితికి నెలకొంది. గర్భిణికి తీవ్రంగా రక్తస్రావం అవుతుండడంతో, 108 సిబ్బంది తెలివిగా వ్యవహరించి వెంటనే ఓ వైద్యురాలికి ఫోన్ చేసి ఆమె సూచన మేరకు ఆ మహిళకు పురుడు పోశారు. సింహాల గర్జనల మధ్యే మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మొత్తానికి 20 నిమిషాల తర్వాత సింహాలు పక్కకు వెళ్లడంతో అంబులెన్స్‌ను జఫరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అమ్రేలి ప్రాంతంలోని గ్రామాల పరిధిలో తరచూ ఇలా సింహాలు గర్జీస్తూ తిరుగుతుంటాయని, వాటితో ఎలా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి తమకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని.. ఆ మేరకు అంబులెన్సులో సేవలందిస్తున్నామని 108 సిబ్బంది వెల్లడించారు.