తనిఖీలపై విమాన సిబ్బంది ఆందోళన

SMTV Desk 2018-03-31 15:14:36  Spice Jet Airlines, airhostesses, proteststrip-searched

చెన్నై, మార్చి 31: స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ తమ సొంత సిబ్బంది పట్ల అమానవీయంగా వ్యవహరించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తనిఖీల పేరుతో తమ దుస్తులు విప్పించి అమానవీయంగా వ్యవహరించారని విమాన సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ విషయ౦ పై చెన్నై విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున సిబ్బంది ఆందోళన చేపట్టారు. కొన్ని రోజులుగా ఎయిర్‌లైన్‌ భద్రతాసిబ్బంది తమపై అమానవీయంగా వ్యవహరిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. విమానం దిగి రాగానే వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనీయకుండా అడ్డుకుని తనిఖీలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఆహారం, ఇతర పదార్థాల విక్రయాల ద్వారా వచ్చే డబ్బును తాము తీసుకుంటున్నామన్న అనుమానంతో తమపై ఇలా తనిఖీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గత మూడు రోజులుగా మమ్మల్ని దుస్తులు విప్పించి మరీ తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల పేరుతో మహిళా భద్రతా సిబ్బంది అభ్యంతరకరంగా తాకుతున్నారు. ప్రయాణికుల భద్రత కోసం మమ్మల్ని నియమించుకుంటారు. తమ పట్ల భద్రతా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యాచారం, వేధింపుల కంటే తక్కువేమి కాదంటూ ఎయిర్‌హోస్టెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.