పాలమూరులో ఎయిర్‌పోర్ట్‌: సీఎం కేసీఆర్‌

SMTV Desk 2018-03-28 11:30:06  CM KCR, Announced, Airport For Palamuru

మహబూబ్‌నగర్‌, మార్చి 28: పాలమూరు జిల్లా అడ్డాకుల వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. ఈ అంశాన్ని ప్రస్తావించారు. అడ్డాకుల మండల కేంద్రం వద్ద ఎయిర్‌పోర్టు చేసేందుకు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాలమూరు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ఇప్పటికే జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌–44), అతిపొడవైన రైల్వే మార్గం జిల్లాలో ఉన్నాయి. తాజాగా ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్త౦ చేస్తున్నారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. పారిశ్రామికంగా అత్యంత వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన రవాణా సౌకర్యాల విషయమై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అలాగే, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి దేశీయ విమానాలు నడిపేందుకు వీలుగా ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన టీఎస్‌ ఐపాస్‌ విధానం, హైదరాబాద్‌కు అతి చేరువలో జిల్లా ఉన్న నేపథ్యంలో పలు కంపెనీలు ఇక్కడ తమ బ్రాంచ్‌లు ఏర్పాటుచేయడానికి క్యూ కడుతున్నాయి. జిల్లాలో పుష్కలమైన మానవ వనరులకు తోడు నిర్వహణ ఖర్చు తక్కువగా ఉన్న నేపథ్యంలో యాజమాన్యాలు సానుకూల స్పందన కనబరుస్తున్నాయి.