ముగ్గురు పై ఏడాది నిషేధం..!

SMTV Desk 2018-03-27 12:18:38  steve smith, ball tampering, david warner, australia

జొహన్నెస్‌బర్గ్, మార్చి 27 ‌: ప్రపంచ క్రికెట్ చరిత్రను ఒక కుదుపు కుదిపేసిన బాల్‌ టాంపరింగ్‌ వివాదం పై అక్కడి క్రికెట్ ఆస్ట్రేలియా తన చర్యలలో వేగం పెంచింది. బాల్ టాంపరింగ్ ఘటనలో చిక్కుకున్న ఆసీస్‌ సారథి స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌, పై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఏడాది కాలం పాటు నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ జట్టు కోచ్‌ డారెన్‌ లెహమాన్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టుకి ముందే డారెన్‌ తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా వీటిపై అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటన పై స్పందించిన ఐసీసీ స్మిత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధంతో పాటు మ్యాచ్‌ ఫీజులో వందశాతం, బెన్‌క్రాఫ్ట్‌ మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. మరో పక్క ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు కెప్టెన్సీ నుంచి స్మిత్‌ను తప్పించి రహానెకు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.