నాయకుడా..ప్రతినాయకుడా..!

SMTV Desk 2018-03-26 11:04:10  steve smith, ball tampering, australia team captain, monkey gate

సిడ్నీ, మార్చి 26 : ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా జట్టుకున్న పేరు, ప్రఖ్యాతలు కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.. కానీ విజయమే పరమావధిగా వారు చేసే కొన్ని చర్యలు ఎప్పటికి మరిచిపోలేనివి. 1981 లో అప్పటి కంగారుల సారథి గ్రెగ్ చాపెల్ అతని తమ్ముడు బౌలర్‌ ట్రెవర్‌ చాపెల్‌తో అండర్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేయించాడు. 2008 లో ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య మంకీ గేట్ వివాదం ఓ సంచలనం సృష్టించింది. తాజాగా బాల్ టాంపరింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఆసీస్ ఆటగాళ్ల జాబితాలో చేరుతాయి. క్రికెట్ అనేది ఒక జెంట్లమన్ గేమ్. కానీ అందులోని విలువలను మరచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన ఈ పని ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. యావత్ క్రీడాలోకం నివ్వెరపోయేలా బాన్ క్రాఫ్ట్ చేత మ్యాచ్ గెలుపుకోసం చేసిన ఈ పనితో ఇప్పుడు ఆస్ట్రేలియా పరువు పాతాళంలోకి పోయింది. ముఖ్యంగా సారథి స్మిత్ గురించి చెప్పాలంటే.. గత ఏడాది భారత పర్యటన సందర్భంగా డీఆర్‌ఎస్‌ అడగాలా వద్దా అని డ్రెస్సింగ్‌ రూంకు సంజ్ఞ చేసి అడ్డంగా దొరికిపోయాడు‌. మీడియా దానికోసం అడగగా ఆ సమయానికి ఏదో మతి భ్రమించి అలా చేశానన్నాడు. తాజా టాంపరింగ్ ఘటనలో మేము కావాలనే చేశామని మీడియా సాక్షిగా అంగీకరించాడు. తను చేస్తున్నది తప్పు అని తెలిసిన నాయకుడు ఇలా ప్రతినాయకుడిలా వ్యవహరించడం ఎవ్వరికి మింగుడుపడని విషయం. ఇప్పటికే పలువురు మాజీలు, క్రీడాకారులు, అభిమానులు అతనిపై తీవ్ర స్థాయిలో పలురకాల వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. స్పిన్నర్ గా జట్టులోకి అడుగుపెట్టిన స్మిత్, 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అనతికాలంలోనే కెప్టెన్ గా ఎదిగాడు. ఆసీస్ దిగ్గజ బ్యాట్స్ మెన్ డాన్ బ్రాడ్ మెన్ తో పోల్చిన అక్కడి అభిమానులు ఇప్పుడు ఛీ కొడుతున్నారు. ఎంతో కాలంగా పెంచుకున్న పేరు ఒక్క ఘటనతో తుడుచుపెట్టుకుపోయింది. అతను చేసిన ఈ పనికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఐసీసీ ఎటువంటి శిక్షలు వేసిన అవి ఆటలో భాగమే కానీ ఈ ఉదంతం స్మిత్ జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోతుంది.