టాంపరింగ్‌ చేసిన కంగారులు..

SMTV Desk 2018-03-25 18:41:35   ball-tampering, Cameron Bancroft, steve smith, australia

కేప్‌టౌన్‌, మార్చి 25 : ఆటలో గెలుపు, ఓటములు సహజం..వాటితో పాటు ఆశ, నిరాశ, పోటీ, ఆలోచనలు, ఇలా చాలా ఉంటాయి. కానీ మనం ఎంత వరకు క్రీడాస్ఫూర్తితో ఆడమనేది ముఖ్యం. అందులో క్రికెట్ లో వివాదాలకు కొదువలేదు. ఇప్పుడు తాజాగా ప్రపంచ నెంబర్ వన్ టీం ఆసీస్ ఏకంగా బాల్ టాంపరింగ్‌ కు పాల్పడింది. ఈ చర్య యావత్ క్రీడాలోకం విస్మయానికి గురిచేసింది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌లో ఇటువంటి నీచమైన చర్యకు కంగారుల సేన పాల్పడింది. అంతే కాకుండా ఆస్ట్రేలియా జట్టు సారథి స్మిత్ సిగ్గు లేకుండా ఈ పని జట్టు ఆటగాళ్ల అందరికి తెలిసే జరిగిందని చెప్పడం ఆ జట్టు నీతిమాలిన పనికి నిదర్శనం. కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్‌ ఆటగాడు బెన్‌ క్రాప్ట్‌ మైదానంలో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. ఓటమి నుండి తప్పించుకొనేందుకు ఆస్ట్రేలియా ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ ఆట మధ్యలో ప్యాంట్‌లో పసుపు రంగు వస్తువును దాచడం కెమెరాల్లో స్పష్టం కన్పించింది. అతను బాల్‌ ట్యాంపరింగ్‌ ప్రయత్నించడం ఫీల్డ్‌ అంపైర్లకు ఫిర్యాదు రావడంతో ఆట మధ్యలోనే అతన్ని పిలిచి వివరణ కోరగా ఏమి లేదని బంతిని తుడిచే నల్లటి వస్త్రం అని చూపించాడు. దీనికి సంతృప్తి చెందిన అంపైర్లు ఆటను కొనసాగించారు. అయితే తొలుత కెమెరాల్లో కనిపించిన వస్తువు, తీరా అంపైర్లకు చూపించినది వేరు కావడంతో అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం బెన్‌ వీడియో అంతర్జాలంలో ఫుల్ వైరల్ గా మారింది. ఆట ముగిసేలోపే ఆస్ట్రేలియా జట్టు బాగోతం గురించి పెద్ద చర్చ నడిచింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో ఆట పూర్తియ్యక బాన్‌క్రాఫ్ట్‌తో పాటు స్మిత్‌ విలేకరుల సమావేశానికి వచ్చాడు. బుకాయించేందుకు వీల్లేని రీతిలో దొరికిపోవడంతో ఇద్దరూ తప్పిదాన్ని అంగీకరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్మిత్ సేన పై విమర్శల పర్వం ఊపందుకొంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్మిత్‌, వార్నర్‌లను కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌‌ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై ఓ మ్యాచ్‌ నిషేధం విధిస్తూ, మ్యాచ్‌ ఫీజులో 100 శాతం కోత విధించింది. ఇక బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్‌ ఆటగాడు బెన్‌క్రాఫ్ట్‌కు మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోత విధిస్తూ.. మూడు డీమెరిట్‌ పాయింట్లను కేటాయించింది.